గురుకుల పాఠశాలల స్థల సేకరణ, డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలి
రూ.5 వేల కోట్లతో 30 ప్రదేశాల్లో 120 గురుకుల పాఠశాలల నిర్మాణం
హాస్టల్లో చదివే ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకోవాలి
విద్యార్థుల వసతులు కల్పనపై ఈ నెల 29 లోగా చెక్ లిస్టు తయారు చేసి ఇవ్వండి
ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారుల దే
పెద్దాపూర్ పాఠశాల విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు కల్పించండి
గురుకుల పాఠశాలల ఉన్నత అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వెల్లడి
సమీక్ష సమావేశానికి హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్ భవనాల నిర్మాణాల కోసం ఆయా నియోజకవర్గాల్లో కావలసిన స్థలాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని స్థలాన్ని సేకరించి డిజైన్స్ వేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ వార్షిక సంవత్సరం రూ. 5 వేల కోట్లతో 30 కాంప్లెక్స్ లో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నత అధికారులతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలోని ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులను తెలంగాణ మరియు దేశ సంపదగా భావిస్తున్నదని చెప్పారు. మానవ వనరులను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ బడ్జెట్ లో విద్య కు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలన్నారు. 8 నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 100% అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు.
ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకోవాలి
ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకోవాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1029 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఇప్పటి వరకు మంచాలు, బెడ్స్, బెడ్ షీట్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంత మందికి ఇవి కావాలి అనే జాబితాను త్వరగా తయారు చేసి తనకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు పంపిన తర్వాత పరిశీలించి వాటిని కొనుగోలు చేయడానికి కావలసిన నిధులు మంజూరు చేస్తానని వెల్లడించారు. అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాల తో పాటు ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థిని విద్యార్థులకు తప్పనిసరిగా టాయిలెట్స్ బాత్రూమ్స్ రన్నింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ, వసతి గదులకు డోర్స్, విండోస్ ఉండాలని విండోస్ నుంచి లోపలికి దోమలు రాకుండా ఉండడానికి కచ్చితంగా మెష్ జాలీ ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నిటిని క్రోడీకరిస్తూ విద్యార్థుల సౌకర్యాల కల్పనపై చెక్ లిస్టు తయారు చేయాలని సూచించారు. చెక్ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు. గురుకులాల భవనాల అద్దె డబ్బులను త్వరలోనే చెల్లిస్తామని అయితే భవనాల యజమానులు విద్యార్థుల సౌకర్యాల కల్పనకు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థుల సౌకర్యాల కల్పనకు కావలసిన వాటి గురించి చెక్ లిస్టు తయారు చేసి ఈనెల 29 లోగా తనకు సమర్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్ విడుదలపై సానుకూలం
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలో పెండింగ్ ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిల జాబితాను తనకు అందజేయాలని అధికారులకు చెప్పారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సంవత్సరం నిర్మిత గడువులోగా ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారుల దేనిని గుర్తు చేశారు. ఈ వార్షికోత్సవంలో బీసీలకు 800, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 500 మంది విద్యార్థులకు చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్ లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
పెద్దాపూర్ పాఠశాలపై సమీక్ష
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన తర్వాత అక్కడ తీసుకున్న చర్యల గురించి గురుకులాల సెక్రటరీ రమణకుమార్ ను ఆరా తీశారు.విద్యార్థులకు మంచాలు,బెడ్స్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా కింద పడుకోవడానికి వీలులేదని, ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల మైదానం ల్యాండ్ లెవెల్ చేయాలని, విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోనే టాయిలెట్స్, బాత్రూంల నిర్మాణం జరుగాలన్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ కావలసిన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. నూతన భవనాల నిర్మాణం కోసం కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా,విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం,డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్,అలుగు వర్షిని,శరత్,తదితరులు పాల్గొన్నారు.
Share